వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈ పవిత్ర దినాన శ్రీ మహా విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా భక్తులు భూమిపై సుఖసంతోషాలను అనుభవిస్తారని, మరణానంతరం వైకుంఠ లోకంలో స్థానం పొందుతారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
పురాణ కథనాల ప్రకారం, వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోకానికి సంబంధించిన ప్రధాన ద్వారం తెరచి ఉంటుందని విశ్వాసం.

వైకుంఠ ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు?
వేద పంచాంగం ప్రకారం, సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్న సమయంలో, పుష్య మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథిన వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును భక్తి భావంతో పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.
2025లో వైకుంఠ ఏకాదశి తేదీ
2025 డిసెంబర్ 30 ఉదయం 07:52 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 05:01 గంటలకు తిథి ముగుస్తుంది.
వైకుంఠ ఏకాదశి పూజా విధానం
ముక్కోటి ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి. అనంతరం ఆవునేతితో దీపారాధన చేసి పవిత్ర వాతావరణాన్ని ఏర్పరచాలి. లక్ష్మీ–నారాయణ స్వామివారిని తులసి మాలలు, గంధ పుష్పాలతో అలంకరించి, శోడశోపచార విధానంలో భక్తిశ్రద్ధలతో పూజించాలి.
శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన చక్రపొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత బ్రాహ్మీ ముహూర్తం ముగిసేలోపు సమీప వైష్ణవాలయానికి వెళ్లి, ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణ స్వామివారి దర్శనం చేయడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది.
ఈ పవిత్ర దినాన నారాయణుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే, ఆయన అనుగ్రహంతో సకల శుభాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మోక్షప్రదమని బ్రహ్మాండ పురాణం స్పష్టంగా వివరిస్తోంది.
వైకుంఠ ఏకాదశి ఉపవాస విధానం
ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించే భక్తులకు శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో సకల విజయాలు లభిస్తాయని శాస్త్రోక్త విశ్వాసం. ఏకాదశి నాడు అన్నం, పప్పుధాన్యాలు సేవించడం నిషిద్ధమని ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది. అందువల్ల ఈ రోజంతా ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. సాయంత్రం చంద్రోదయానికి ముందే పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే సేవిస్తే, ఏకాదశి వ్రత ఫలం సంపూర్ణంగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు










